

ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడే (22) ఆత్మహత్య ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డీన్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఐఐటీ బాంబే ప్రకటించింది. విద్యార్థి ఆత్మహత్యకు ప్రొఫెసర్ కుల వివక్ష, మానసిక వేధింపులే కారణమని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్, శుక్రవారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు జరిగిన మిడ్-సెమిస్టర్ పరీక్షలో, చాట్‌జీపీటీ సాయంతో సాహిల్ సమాధానాలు రాస్తుండగా ఇన్విజిలేటర్‌గా ఉన్న ప్రొఫెసర్ సూర్యనారాయణ పట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తన కుమారుడి మృతికి ప్రొఫెసర్ సూర్యనారాయణే కారణమని సాహిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రొఫెసర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అభియోగాలతో కేసు నమోదు చేశారు.
మరోవైపు, ఘటనపై తాము మొదట విడుదల చేసిన ప్రకటన పట్ల ఐఐటీ బాంబే విచారం వ్యక్తం చేసింది. విచారణ పూర్తికాకుండానే సాహిల్‌ను దోషిగా తేల్చడంపై విద్యార్థులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో, సంస్థ క్షమాపణలు చెబుతూ సోమవారం మరో ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ప్రొఫెసర్ సూర్యనారాయణను డీన్ పదవితో పాటు ప్రొఫెసర్ హోదా నుంచి కూడా తొలగించాలని విద్యార్థులు క్యాంపస్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే, తోటి అధ్యాపకులు, ఐఐటీ మద్రాస్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రొఫెసర్ సూర్యనారాయణకు మద్దతుగా నిలిచాయి. ఆయన నిబంధనల ప్రకారమే నడుచుకున్నారని, విద్యార్థుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని ఫ్యాకల్టీ ఫోరమ్ పేర్కొంది. కాగా, ప్రొఫెసర్ సూర్యనారాయణ గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. ఆయన 2000లో అక్కడి నుంచి బీటెక్ పూర్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!