

ఆఫీసులు, ఇళ్లకే పరిమితం కాకుండా పచ్చని వాతావరణంలో పనిచేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు సైబరాబాద్‌లో ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ విధానాన్ని తీసుకురానున్నారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, ఫ్రీలాన్సర్లు, స్టార్టప్ బృందాలు ప్రకృతి మధ్య ప్రశాంతంగా విధులు నిర్వహించుకునేలా పార్కులను ఆధునిక వర్క్‌స్పేస్‌లుగా అభివృద్ధి చేస్తున్నారు. మాదాపూర్‌లోని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ జి. సృజన ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. తమ పరిధిలో మొత్తం 30 నుంచి 40 పార్కులను ఈ విధంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
తొలి దశలో శేరిలింగంపల్లి జోన్‌లోని మజీద్‌బండ మాధవ్ హిల్స్ కాలనీలో 1.5 ఎకరాల పార్కును, కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మాదాపూర్‌లో ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న పార్కును ఎంపిక చేశారు. ఈ పార్కుల్లో పనులు తుది దశకు చేరుకున్నాయని, జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ వర్క్‌స్టేషన్లు, సౌకర్యవంతమైన సీటింగ్, ఉచిత హైస్పీడ్ వైఫై, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు, సమావేశాల కోసం ప్రత్యేక ప్రదేశాలు, యాంఫీథియేటర్, కాఫీ, టీ, స్నాక్స్ అందించే కియోస్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. వాకింగ్ ట్రాక్‌లు, ఆధునిక శౌచాలయాలు, ఈవీ ఛార్జింగ్ కేంద్రాలతో పాటు సీసీటీవీ నిఘా, భద్రతా ఏర్పాట్లు కూడా కల్పించనున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉండే ఈ సదుపాయాలను వచ్చే ఏడాది నుంచి నామమాత్రపు రుసుముతో వినియోగించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. తొలి దశకు వచ్చే స్పందన ఆధారంగా మరిన్ని పార్కులకు ఈ ప్రాజెక్టును విస్తరించనున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!