

భారతీయ పండుగల్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. దీపాల వెలుగులు, బాణసంచా శబ్దాలతో ఈ పండుగను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా పండుగ సందడి నెలకొనగా, బాణసంచా కొనుగోళ్ల కోసం దుకాణాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అయితే, టపాసులు కాల్చేటప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అందుకే మద్యం సేవించి బాణసంచా కాల్చకూడదు. ఇంటి లోపల ఎట్టి పరిస్థితుల్లోనూ టపాసులు పేల్చకూడదు. గుర్తింపు పొందిన సంస్థల నాణ్యమైన పటాకులను సీలు చేసిన ప్యాకెట్లలోనే కొనుగోలు చేయాలి.
పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు పెద్దలు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. మైదానాలు, ఖాళీ ప్రదేశాల్లోనే బాణసంచా కాల్చాలి. పెట్రోల్ బంకులు, గ్యాస్ నిల్వ కేంద్రాలు, గుడిసెలు, తాత్కాలిక దుకాణాలు, సులభంగా మంటలు అంటుకునే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. పొడవైన అగరబత్తులు లేదా కొవ్వొత్తులతో పటాకులను వెలిగిస్తూ శరీరానికి, ముఖానికి తగినంత దూరం పాటించాలి. పేలని టపాసుల దగ్గరకు వెళ్లి పరిశీలించకూడదు. ముందుజాగ్రత్తగా రెండు బకెట్ల నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. చిన్నపాటి కాలిన గాయాలు అయితే వెంటనే చల్లని నీటితో గాయమైన ప్రాంతాన్ని చల్లబరచాలి. దుస్తులకు మంటలు అంటుకుంటే శుభ్రమైన కాటన్ దుప్పటి లేదా బెడ్‌షీట్‌తో మంటలను ఆర్పి, బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించాలి. ముఖం లేదా కళ్లకు గాయాలైతే ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందాలి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!