

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ త్వరలో దర్శకుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. తన తొలి దర్శకత్వ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను ఇప్పటికే మొదలుపెట్టినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్ని నెలల క్రితమే కథ రాయడం ప్రారంభించానని, అయితే రచన అనుకున్నదానికంటే చాలా కష్టమైన ప్రక్రియ అని తెలిపారు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేసిన తర్వాత, వచ్చే రెండుమూడేళ్లలో తన తొలి సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్రణాళిక వేస్తున్నట్లు చెప్పారు.
కథలు రాసి వాటిని వెండితెరపైకి తీసుకువచ్చే రచయితలు, సృష్టికర్తలపై ఈ అనుభవంతో తనకు మరింత గౌరవం పెరిగిందని రణబీర్ పేర్కొన్నారు. సంగీతకారుడి తర్వాత అత్యంత సృజనాత్మకమైన అనుభూతిని దర్శకుడు పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక కథను నచ్చిన విధంగా తెరపై ఆవిష్కరించేందుకు అందరినీ ఒకే లక్ష్యంతో ముందుకు నడిపించడం దర్శకుడికి ప్రత్యేకమైన అనుభవమని చెప్పారు. దర్శకుడిగా ఆ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఈ వార్తతో రణబీర్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!