

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో పలు ప్రాంతాల్లో వరద ముప్పు పెరిగింది. రాష్ట్రంలోని ప్రధాన నదులు, వాగుల్లో నీటిమట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. దెహ్రాదూన్‌లో తమసా నది ప్రమాదకర స్థాయిని దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రసిద్ధ తపకేశ్వర్ ఆలయ పరిసరాలు, ఘాట్లు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రిషికేశ్‌లో గంగానది ఉగ్రరూపం దాల్చడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హరిద్వార్‌లోనూ గంగా ప్రవాహం ఉద్ధృతంగా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం సూచించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!