

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండగా హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో 5.8 సెం.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. తాంసి, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల, వికారాబాద్, కామారెడ్డి, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోనూ గణనీయమైన వర్షాలు కురిశాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలుచోట్ల రహదారులు జలమయమవగా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావరణశాఖ ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రాచలం, ములుగు, నిర్మల్ జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఇదే సమయంలో ములుగు జిల్లా మంగపేట మండలంలో సుడిగాలి బీభత్సం సృష్టించి భారీ వృక్షాలు నేలకూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి. 11 కేవీ విద్యుత్ లైన్‌పై చెట్ల కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది. పరిస్థితిని అటవీశాఖ అధికారులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!