

శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. జూరాల జలాశయానికి వరద ప్రవాహం తగ్గడం, విద్యుత్ ఉత్పత్తి కోసం నీటి వినియోగంతో పాటు కృష్ణానదిపై ఆధారపడిన ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం స్థిరంగా ఉంది. ఆదివారం సాయంత్రానికి శ్రీశైలానికి 36,233 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. జలాశయంలో నీటిమట్టం 878.60 అడుగులకు చేరగా, నీటి నిల్వ 181.0590 టీఎంసీలుగా ఉంది. మరో ఆరు అడుగుల నీరు చేరితే జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది.
శ్రీశైలం నుంచి ఏపీ జల విద్యుత్ కేంద్రానికి 26,093 క్యూసెక్కులు, ఎస్ఎల్బీహెచ్ఈఎస్కు 22,419 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 1,611 క్యూసెక్కులు, ఎంజీకేఎల్ఐకి 1,917 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు జలాశయానికి 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు జూరాల జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో ఆదివారం ఉదయం నుంచి గేట్ల ద్వారా నీటి విడుదలను నిలిపివేశారు. ప్రస్తుతం జూరాలలోకి 63 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు 43 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!