

వైద్య పరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాలను సక్రమంగా భద్రపరచలేదన్న ఆరోపణలతో హార్వర్డ్ యూనివర్సిటీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ శవాగారానికి మాజీ మేనేజర్‌గా పనిచేసిన సెడ్రిక్ లాడ్జ్.. దానం చేసిన మృతదేహాల నుంచి శరీర భాగాలను అక్రమంగా తొలగించి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. 2018 నుంచి అతడు ఈ వ్యవహారానికి పాల్పడినట్లు తేలింది. తలలు, చర్మం, చేతులు తదితర శరీర భాగాలను తన ఇంటికి తరలించి, భార్య సహాయంతో విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. 2023లో అరెస్టైన లాడ్జ్‌కు గతేడాది డిసెంబర్‌లో ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించారు.
ఈ ఘటనపై మృతదేహాలను దానం చేసిన కుటుంబాలు తమ ఆత్మీయుల పట్ల గౌరవం పాటించలేదంటూ హార్వర్డ్‌పై న్యాయపరమైన చర్యలు చేపట్టాయి. ఈ కేసులను పరిష్కరించుకునేందుకు హార్వర్డ్ రూ.507 కోట్ల సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. బోస్టన్‌లోని న్యాయస్థానం ఈ సెటిల్‌మెంట్‌ను ఆమోదించింది. బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలను మరింత కఠినతరం చేస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. మృతదేహాలను వైద్య విద్య, పరిశోధనల కోసం దానం చేసిన వారి జ్ఞాపకార్థం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!