

తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను వెంటనే అడ్డుకోవాలని, ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన హరీశ్ రావు, రాష్ట్ర జల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
కురిడి 2 టీఎంసీలు, చిక్కాలపర్వి 2.5 టీఎంసీలు, చిక్కాలమంచి 5 టీఎంసీల సామర్థ్యంతో కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులు తెలంగాణకు నష్టం కలిగిస్తాయని ఆయన ఆరోపించారు. ఆర్డీఎస్‌కు రావాల్సిన నీటి ప్రవాహాలు తగ్గిపోతాయని, ఇప్పటికే కర్ణాటక తనకు కేటాయించిన 1.2 టీఎంసీలకు బదులుగా సగటున 5 టీఎంసీల నీటిని వినియోగిస్తోందని తెలిపారు.
కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై కేంద్ర జల సంస్థలు, సంబంధిత అధికారులకు ప్రభుత్వం వెంటనే అభ్యంతరాలు తెలియజేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించారు. తెలంగాణ జల హక్కులను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!