

రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసే ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం డీరెగ్యులేషన్ రెండో విడత చర్యలు చేపట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిబంధనల సరళీకరణ, అనవసర నియంత్రణల తొలగింపుపై ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు), లైసెన్సులు, ఇతర అనుమతుల సంఖ్యను పదిలోపు తగ్గిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ చర్యలతో పరిశ్రమల స్థాపన మరింత సులభతరం కావడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ఊతం లభించనుంది.
మరోవైపు, రాష్ట్రంలోని అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ‘సమావేశి ఆజీవిక యోజన’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన–జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు వివరించారు. యానాది, చెంచు సామాజిక వర్గాల జనాభా అధికంగా ఉన్న 26 మండలాల్లోని 650 గ్రామ సంఘాల ద్వారా 10 వేల నిరుపేద కుటుంబాలను ఎంపిక చేయనున్నారు. ఉపాధి సఖుల సహకారంతో ప్రకృతి వ్యవసాయం సహా వివిధ రంగాల్లో జీవనోపాధి కల్పించేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభమై, నవంబరు 16న అర్హులైన కుటుంబాల జాబితాను ప్రకటించనున్నారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!