

ఫార్ములా భారత్ – 2027 పోటీలకు సిద్ధమవుతున్న చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) విద్యార్థుల రేసింగ్ టీమ్ ‘ప్రహెతి రేసింగ్ – SAE CBIT’కు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్లాటినమ్ స్పాన్సర్‌గా ఈ ప్రోత్సాహాన్ని అందించిన మంత్రికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని, మంత్రి అందించిన ప్రోత్సాహం తమకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
CBIT పూర్వ విద్యార్థిగా మంత్రి తమ కళాశాల విద్యార్థుల సాంకేతిక ప్రతిభను ప్రోత్సహించేందుకు ముందుకు రావడం ప్రత్యేకంగా భావిస్తున్నామని టీమ్ సభ్యులు తెలిపారు. ఆయన అందించిన ఆర్థిక సహాయంతో తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడంతో పాటు ఫార్ములా భారత్ – 2027 పోటీల్లో సమర్థవంతంగా పాల్గొనేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రాక్టికల్‌గా ఉపయోగిస్తూ రేసింగ్ కారును రూపొందించడం, జాతీయ స్థాయిలో పోటీపడటం తమ లక్ష్యమని వివరించారు. మంత్రి ప్రోత్సాహం తమ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచిందని, ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ప్రహెతి రేసింగ్ టీమ్‌కు అరవింద్ కెప్టెన్‌గా, స్మిత్ బోర్సే వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌గా డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని మార్గనిర్దేశం చేస్తున్నారు. విద్యార్థుల ప్రయత్నాన్ని అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, యువత చదువుతో పాటు పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలు, ప్రాక్టికల్ అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు తమ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు. ఫార్ములా భారత్ – 2027 పోటీల్లో ప్రహెతి రేసింగ్ టీమ్ విజయవంతంగా రాణించి CBIT కళాశాలకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!