

ఆంధ్రప్రదేశ్‌లో నూతన పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిబంధనలను సరళీకరించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని కఠిన నిబంధనలను తొలగిస్తూ ఏపీ విద్యా సంస్థల నిబంధనలకు పలు సవరణలు చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం ప్రీప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఏర్పాటుకు జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈవో), సెకండరీ పాఠశాలలకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్జేడీ) అనుమతులు మంజూరు చేస్తారు. పారిశుధ్య ధ్రువీకరణ పత్రానికి బదులుగా స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. ట్రాఫిక్, మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీ నుంచి తీసుకోవాల్సిన నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) స్థానంలోనూ స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించే వెసులుబాటు కల్పించారు. అయితే తప్పుడు పత్రాలు సమర్పిస్తే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
మరోవైపు పాఠశాలల ఏర్పాటులో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్మాణ స్వరూప ధ్రువీకరణ పత్రం, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, అగ్నిమాపక భద్రతా ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. విద్యా సంవత్సరంలో అక్టోబరు 31 వరకు పాఠశాలల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.50 వేల జరిమానాతో డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న మూడు నెలల్లో అనుమతులు మంజూరు చేస్తారు. ఒకవేళ అనుమతులను నిరాకరిస్తే అందుకు గల కారణాలను ఉత్తర్వుల్లో స్పష్టంగా వెల్లడించాలి. సింగిల్ విండో పోర్టల్ ద్వారా పాఠశాలలకు గుర్తింపు మంజూరు చేయనున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!