

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖండించింది. ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేస్తూ ఫ్యాక్ట్ చెక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రూ.611.80 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు చివరి దశకు చేరుకున్నాయని తెలిపింది. త్వరలోనే దీనిని ప్రారంభించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తున్నాయి.
అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్‌ను దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికగా అభివర్ణిస్తూ, గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల సమీపంలో సుమారు 4,618 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది అమరావతిని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొంది. కొత్త ఎయిర్‌పోర్ట్ వచ్చినా, విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఒకే నగరంలో రెండు విమానాశ్రయాలు ఉండటం సాధారణమని, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!