

ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని పట్టాలు అందుకున్న యువ గ్రాడ్యుయేట్లకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ యువతను చూస్తే గర్వంగా ఉందని, భవిష్యత్ భారత్‌ను నిర్మించబోయేది యువతేనని అన్నారు. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులతో సరదాగా మాట్లాడిన ప్రధాని.. వేడుకలో కూర్చున్నప్పటికీ వారి ఆలోచనలు మాత్రం భవిష్యత్ గురించే ఉంటాయని అన్నారు. తాను బాబా బాగేశ్వర్ కాదని, వారి మనసుల్లో ఏముందో చెప్పలేనని చమత్కరించి సభలో నవ్వులు పూయించారు. కొందరు తొలి ఉద్యోగం, తొలి జీతం కోసం ఎదురుచూస్తుండవచ్చని, మరికొందరు స్టార్టప్‌లు ప్రారంభించడం, ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆలోచిస్తుండవచ్చని చెప్పారు. సాంకేతికత కారణంగా ప్రపంచ వ్యవస్థ వేగంగా మారుతోందని, రాబోయే దశాబ్దాల్లో ఈ మార్పులను ఎదుర్కొనేందుకు నిరంతర అభ్యాసం ఎంతో అవసరమని మోదీ పేర్కొన్నారు. ప్రతి తరానికి ఒక జాతీయ బాధ్యత ఉంటుందని, రాబోయే 30–35 ఏళ్లలో విద్యార్థులు చేసే ప్రతి పని వికసిత భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!