

బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసులో నిందితుడు ఉప్పుతొల్ల మల్లేష్‌ను పోలీసులు విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. దాదాపు 16 ఏళ్ల పాటు మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసిన మల్లేష్ ఆయుధాల నిల్వ కేంద్రం, భద్రతా వ్యవస్థపై తనకున్న అవగాహనతో చోరీకి పథకం వేసినట్లు దర్యాప్తులో గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. సెలవు రోజున భద్రతా సిబ్బంది, ఆర్మీ అధికారుల కదలికలు తక్కువగా ఉంటాయని భావించి ఆ రోజును ఎంచుకున్నట్లు తెలిపారు. గాయాలు, క్రమశిక్షణకు సంబంధించిన కారణాలతో జూన్‌లో సర్వీసు నుంచి తొలగించబడిన మల్లేష్.. అధికారులపై అసంతృప్తితో ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.
చోరీ చేసిన ఆయుధాలను విక్రయించి వచ్చిన డబ్బుతో తన ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవాలని మల్లేష్ భావించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందుకోసం ఆయుధాలు కొనుగోలు చేసే వ్యక్తుల కోసం సామాజిక మాధ్యమాల్లో వెతికినట్లు దర్యాప్తులో గుర్తించామని తెలిపారు. మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేస్తున్న తన పరిచయస్తులతో మల్లేష్ తరచూ ఫోన్‌లో మాట్లాడినట్లు, ఆయుధాల నిల్వ కేంద్రం, భద్రతా ఏర్పాట్లు, నిఘా కెమెరాలపై ఆరా తీసినట్లు కూడా పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆయుధాల చోరీ కేసులో ఇతరుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా పూర్తి వివరాలను నిర్ధారించాల్సి ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!