

వాయిస్, ఎస్సెమ్మెస్ ప్రయోజనాలతో మరిన్ని స్పెషల్ టారిఫ్ వోచర్లు అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ టెలికాం కంపెనీలను ఆదేశించింది. తక్కువ కాలవ్యవధితో పాటు అందుబాటు ధరల్లో వాయిస్, ఎస్సెమ్మెస్ మాత్రమే ఉండే ఎస్‌టీవీలను అందించాలని సూచించింది. ట్రాయ్ 2026 సెప్టెంబర్ 22న టెలికాం కన్జూమర్ ప్రొటెక్షన్ 13వ సవరణ నిబంధనలను జారీ చేసింది. 2024లో తీసుకొచ్చిన నిబంధనల తర్వాత కూడా వాయిస్, ఎస్సెమ్మెస్ మాత్రమే ఉన్న ఎస్‌టీవీలు పరిమితంగా ఉండటం, ఎక్కువగా దీర్ఘకాల వ్యాలిడిటీతోనే అందుబాటులో ఉండటాన్ని ట్రాయ్ గుర్తించింది.
కొత్త నిబంధనల ప్రకారం, డేటాతో కూడిన వాయిస్, ఎస్సెమ్మెస్ ఎస్‌టీవీకి ఏ వ్యాలిడిటీ ఉంటే, అదే వ్యాలిడిటీకి ప్రత్యేకంగా వాయిస్, ఎస్సెమ్మెస్ వోచర్‌ను కూడా అందించాలి. 30 రోజుల వ్యాలిడిటీతో పాటు 30 రోజుల కంటే తక్కువ వ్యవధి కలిగిన ఆప్షన్లను కూడా అందుబాటులో ఉంచాలని ట్రాయ్ పేర్కొంది. అలాగే ప్రతి నెలా ఒకే తేదీన రెన్యువల్ చేసుకునే వీలున్న వోచర్లను అందించాలని సూచించింది. ఈ మార్పులతో ముఖ్యంగా డేటా అవసరం లేని, తక్కువ ఆదాయ వర్గాల వినియోగదారులకు తమ అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ చేసుకునే అవకాశం పెరుగుతుందని ట్రాయ్ తెలిపింది. నిబంధనల ప్రకటన అనంతరం వొడాఫోన్ ఐడియా షేర్లు లాభపడగా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!