

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు బుక్ చేసుకున్న వినియోగదారుడికి షో రద్దు విషయాన్ని ముందుగానే తెలియజేయకపోవడంతో బుక్‌మైషో సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ షాక్ ఇచ్చింది. వినియోగదారుడికి కలిగిన మానసిక వేదన, సమయ నష్టాన్ని పరిగణనలోకి తీసుకొని సంస్థకు జరిమానా విధించింది. బాధితుడికి రూ.10 వేల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది.
కూకట్‌పల్లికి చెందిన నారాయణన్ కుట్టిగోపాల కృష్ణన్ 2025 జనవరి 1న కుటుంబంతో కలిసి సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. లులు మాల్‌లోని సినీపోలిస్ థియేటర్‌లో ఉదయం 10:50 గంటలకు ప్రదర్శించాల్సిన ‘బారోజ్’ చిత్రానికి టికెట్‌ను బుక్ చేసుకున్నారు. అయితే థియేటర్‌కు వెళ్లిన తర్వాత ఆ షో రద్దయిందని, దాని స్థానంలో మరో సినిమా ప్రదర్శిస్తున్నారని తెలిసింది. ఈ విషయాన్ని ముందుగానే తెలియజేయకపోవడంతో ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
విచారణలో బుక్‌మైషో సంస్థ తాము కేవలం మధ్యవర్తులమని, టికెట్ ధర రూ.207.14ను తిరిగి చెల్లించామని పేర్కొంది. అయితే కమిషన్ ఈ వాదనలను తిరస్కరించింది. షో రద్దు విషయాన్ని వినియోగదారుడికి తెలియజేయాల్సిన బాధ్యత వేదికపైనే ఉంటుందని స్పష్టం చేసింది. కేవలం డబ్బు తిరిగి ఇవ్వడం సరిపోదని, వినియోగదారుడికి కలిగిన మానసిక వేదనకు సంస్థ బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!