

హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయ భవనంలోని రెండో అంతస్తులో కీలక రికార్డులు, చెక్కులు భద్రపరిచిన గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్యాలయ సిబ్బంది కొంతసేపు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే మంటల్లో కీలక రికార్డులు, చెక్కులు ఎంతమేరకు దెబ్బతిన్నాయనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఆస్తి నష్టాన్ని అంచనా వేయడంతో పాటు ప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!