

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కే.జే. జార్జ్‌తో సమావేశమయ్యారు. ఇప్పటికే ఉన్న ఇంధన సరఫరా ఒప్పందంలో భాగంగా సింగరేణి బొగ్గు సరఫరా, భవిష్యత్ ఇంధన అవసరాలపై ఇరువురు మంత్రులు చర్చించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో కర్ణాటక జెన్కోకు చెందిన బొగ్గు బ్లాకుల మైనింగ్‌లో సింగరేణి సంస్థ అనుభవాన్ని వినియోగించుకోవాలని భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, సింగరేణి సంయుక్త భాగస్వామ్యంతో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టే ప్రతిపాదనకు కే.జే. జార్జ్ సానుకూలంగా స్పందించారు.
కర్ణాటకకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయాలని జార్జ్ కోరగా, కర్ణాటక పవర్ కార్పొరేషన్‌కు రోజుకు నాలుగు బొగ్గు రేకులను సరఫరా చేయాలని సింగరేణి అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. ఒడిశాలోని నైని బొగ్గు గని నుంచి కర్ణాటక విద్యుత్ అవసరాల కోసం ఏడాదికి 10 లక్షల టన్నుల బొగ్గును అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు. అలాగే సింగరేణి వేలంలో దక్కించుకున్న కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలోని బంగారం, రాగి ఖనిజ బ్లాకును భట్టి విక్రమార్క పరిశీలించనున్నారు. ఖనిజ అన్వేషణపై స్థానిక అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!