

భారత్-పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని రాజస్థాన్‌లో భారీ పేలుడు సంభవించింది. శ్రీగంగానగర్ జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో రైల్వే ట్రాక్ దెబ్బతింది. ప్రయాణికుల రైలు ఆ మార్గంలో వెళ్లిన కొద్దిసేపటికే పేలుడు సంభవించడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రయాణికుల రైలును లక్ష్యంగా చేసుకుని పేలుడుకు పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైల్వే ట్రాక్‌పై 50 జీబీ పాయింట్ సమీపంలో జరిగిన పేలుడు ధాటికి ట్రాక్‌కు ఆధారంగా ఉన్న రెండు కాంక్రీట్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. అక్కడ సుమారు రెండు అడుగుల లోతులో గుంత ఏర్పడింది. పేలుడు శబ్దం వినిపించిందని సమీప ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. యాంటీ టెర్రరిజం బృందాలు, బాంబు నిర్వీర్య దళాలు తనిఖీలు చేపట్టాయి. ప్రయాణికుల రైలును లక్ష్యంగా చేసుకునే కుట్ర జరిగిందా? ఇటీవల పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ల ద్వారా జారవిడిచిన ఆయుధాలు, ఆర్డీఎక్స్ స్వాధీనం చేసుకున్న ఘటనకు ఈ పేలుడుతో సంబంధం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!