

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 12,760 రెవెన్యూ గ్రామాల్లో కేవలం 1,609 గ్రామాల్లో మాత్రమే వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగుతుండగా, మిగిలిన 11,151 గ్రామాలు వర్షాభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు 2,320 గ్రామాల్లో స్వల్ప, 7,959 గ్రామాల్లో తీవ్ర, 892 గ్రామాల్లో అత్యంత తీవ్ర వర్షపాతం లోటు నమోదైంది. మొత్తం 23 జిల్లాల్లో ఇంకా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, మిగిలిన 10 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ వానాకాలంలో 53 రోజులలో కేవలం 27 రోజులు మాత్రమే వర్షాలు కురవడంతో రాష్ట్ర సగటు వర్షపాతం 287.6 మిల్లీమీటర్లకు బదులుగా 217.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదై 24 శాతం లోటు ఏర్పడింది.
వర్షాభావం కారణంగా రాష్ట్రంలోని 1.32 కోట్ల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణంలో ఇప్పటివరకు 67.78 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. వరి సాగు దాదాపు 27.44 లక్షల ఎకరాలు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులు వరికి బదులుగా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, మక్కజొన్న, ఉద్యాన పంటలు సాగు చేయాలని సూచించింది. అలాగే సూక్ష్మ నీటిపారుదల, వర్షపు నీటి సంరక్షణ, నాణ్యమైన విత్తనాల సరఫరా, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు వంటి చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వానికి నివేదికలో సిఫార్సు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!