

ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. భారత్ సహా పలు దేశాలు అప్రమత్తమై నివారణ చర్యలు చేపడుతున్నప్పటికీ, వైరస్ కేంద్రంగా మారిన కాంగోలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఈశాన్య కాంగోలోని బునియా నగరంలో మే 15న తొలి కేసు నమోదైనప్పటికీ, అంతకంటే దాదాపు రెండు నెలల ముందే వైరస్ వ్యాప్తి ప్రారంభమైనట్లు అంతర్జాతీయ విచారణల్లో తేలింది. దీంతో ఇప్పటికే భారీ స్థాయిలో వైరస్ వ్యాప్తి జరిగి ఉండొచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగోలో వైద్య సదుపాయాల కొరత తీవ్రంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఐసోలేషన్ సెంటర్లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు, టెస్ట్ కిట్లు సరిపడా లేవని తెలుస్తోంది. జనరేటర్లకు ఇంధనం లేక రోజుకు కేవలం 20 నుంచి 40 టెస్టులు మాత్రమే నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ నిధుల కొరతతో పరిస్థితి మరింత విషమించింది. ఇదిలా ఉండగా, ఎబోలా బాధితుల మృతదేహాలను సంప్రదాయ అంత్యక్రియల కోసం కొందరు బలవంతంగా తీసుకెళ్లడం వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదాన్ని పెంచుతోంది. ఇప్పటివరకు 900కు పైగా కేసులు నమోదవగా, మరణాల రేటు 40 శాతంగా ఉన్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!