

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా తెరవాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నప్పటికీ వాటిని టెహ్రాన్ బహిరంగంగా ఖండించడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. అలాగే ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోదని స్పష్టం చేస్తూ, అమెరికా తదుపరి చర్యలపై మరో 48 గంటల్లో స్పష్టత వస్తుందని తెలిపారు.
మరోవైపు హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకల స్వేచ్ఛాయుత రాకపోకల కోసం ఇరాన్, ఒమన్‌తో చర్చలు జరుగుతున్నాయని అమెరికా పేర్కొంది. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ త్వరలోనే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ ప్రకటనను ఇరాన్ ఖండిస్తూ, ఒమన్‌తో జరుగుతున్న చర్చల్లో అమెరికాకు ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. తమ సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలను పరిరక్షించే కొత్త సముద్ర రవాణా విధానంపైనే చర్చలు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలపై అంతర్జాతీయ వర్గాలు దృష్టిసారించాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!