

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వెలుగుచూసిన ఘటనలో, ప్రపంచ కుబేరుల పేర్లను ఉపయోగించి ఓ పదవీ విరమణ పొందిన వైద్యుడి నుంచి రూ.10.11 లక్షలు కాజేశారు. పేట్‌బషీరాబాద్‌కు చెందిన 70 ఏళ్ల డాక్టర్ కృష్ణయ్యకు ఫోన్ చేసిన నిందితులు, తాము ప్రముఖ కుబేరులమని పరిచయం చేసుకుని పజిల్స్ పూర్తి చేస్తే ఉచితంగా టెస్లా కారు, బంగారం, నగదు బహుమతులుగా ఇస్తామని నమ్మించారు.
వైద్యుడి నమ్మకాన్ని పొందేందుకు సరుకు రవాణా విమానాల్లో కార్లు ఎక్కిస్తున్నట్లు కనిపించే కృత్రిమ మేధస్సుతో రూపొందించిన నకిలీ దృశ్యాలను పంపించారు. పజిల్స్ పూర్తి చేసిన తర్వాత బహుమతులు భారతదేశానికి వస్తున్నాయని చెప్పి, కస్టమ్స్ క్లియరెన్స్, డెలివరీ రుసుము, బీమా, దిగుమతి సుంకం, ఇంధన వ్యయం పేర్లతో డబ్బు వసూలు చేశారు. దీంతో బాధితుడు విడతల వారీగా వివిధ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేశాడు. కుటుంబ సభ్యుల అప్రమత్తతతో మోసం బయటపడగా, బాధితుడి కుమారుడు ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!