

అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రానికి రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆర్థిక సాయం కోరినట్లు వెల్లడించారు. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. గురువారం డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలంలో తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఆయన.. రైతులు, ముంపు బాధితులతో మాట్లాడారు. తుపాను సమాచారం అందిన వెంటనే 30 వేల మంది అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, ముందస్తు చర్యల వల్ల ప్రాణనష్టాన్ని తగ్గించగలిగామని పేర్కొన్నారు. అయినప్పటికీ గోడ కూలడం, విద్యుదాఘాతం వంటి ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
తుపాను గాలులకు రాష్ట్రవ్యాప్తంగా 10 వేలకు పైగా విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయని, వాటిలో కోనసీమ జిల్లాలోనే సుమారు 8 వేల స్తంభాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. విద్యుత్తు పునరుద్ధరణ పనుల్లో రెండు వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, తెలంగాణ నుంచి మరో వెయ్యి మందిని పంపించాలని కోరినట్లు చెప్పారు. అవసరమైతే తమిళనాడు, కర్ణాటక సిబ్బంది సహకారం కూడా తీసుకుంటామని, రెండు రోజుల్లో విద్యుత్తు సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. పంటలు, కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటలకు జరిగిన నష్టంపై రైతులకు పరిహారం అందిస్తామని, పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్లేవారికి బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు నగదు సాయం అందిస్తామని తెలిపారు. మరోవైపు అమిత్‌షా ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులతో పాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రితో మాట్లాడి, కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. నష్టాన్ని అంచనా వేసేందుకు అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందాలను పంపనున్నట్లు వెల్లడించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!