

ఐపీఎస్ అధికారిణి సంజుక్త పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక అటవీ యుద్ధ విభాగం కోబ్రా (CoBRA) ఐజీగా నియమితులయ్యారు. దీంతో కోబ్రా విభాగానికి నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా అధికారిణిగా ఆమె రికార్డు సృష్టించారు. 2006 బ్యాచ్‌కు చెందిన అస్సాం-మేఘాలయ క్యాడర్ ఐపీఎస్ అధికారిణి అయిన సంజుక్త పరాశర్.. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి దనేష్ రాణా స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. సీఆర్‌పీఎఫ్ ప్రధాన కార్యాలయం ఆమె నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ఇటీవల జారీ చేసింది.
అస్సాంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించిన సంజుక్త పరాశర్.. జాతీయ దర్యాప్తు సంస్థలోనూ సేవలందించారు. అస్సాంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో ఆమెకు విస్తృత అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెను ‘అస్సాం ఐరన్ లేడీ’గా పిలుస్తుంటారు. జంగిల్ వార్‌ఫేర్, గెరిల్లా ఆపరేషన్లలో ప్రత్యేక శిక్షణ పొందిన కోబ్రా విభాగాన్ని 2008-09లో వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు కూడా పనిచేస్తోంది. మణిపూర్‌లో సాయుధ హింసను నియంత్రించేందుకు ఇటీవల రెండు కోబ్రా యూనిట్లను మోహరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!