

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎనుములదొడ్డిలో గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మఫ్టీలో ఉన్న బాషా అనే కానిస్టేబుల్‌పై వైఎస్సార్సీపీ కార్యకర్తలు కత్తులు, కర్రలతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో వైఎస్సార్సీపీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచి అభ్యర్థి లక్ష్మీకాంత్ ఆధిక్యంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు హంగామా సృష్టించి ప్రత్యర్థులపై దాడికి దిగినట్లు సమాచారం.
ఇదే సమయంలో తన లగేజీ తీసుకునేందుకు వెళ్లిన బాషాపై వారు ఒక్కసారిగా దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. తాను పక్క గ్రామంలో బందోబస్తు విధులకు వచ్చిన పోలీసు కానిస్టేబుల్‌నని చెప్పినా దాడి ఆపలేదని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆయన కుడిభుజం, వీపుపై రక్తగాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న తోటి పోలీసులు ఆయనను రక్షించినట్లు సమాచారం. అనంతరం మెరుగైన వైద్యం కోసం కళ్యాణదుర్గానికి తరలించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!