

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇంచార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో 1,000 రోజుల ప్రగతిని ప్రజలకు వివరించడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో జరిగిన మహా ధర్నా సన్నాహక సమావేశంలో మంత్రులు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అలాగే ప్రజా సమస్యలపై ప్రతిపక్ష నేతగా వ్యవహరించకుండా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం లేదని, తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. దాదాపు 1,000 రోజులుగా ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీకి హాజరు కాకుండా, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఎలా కొనసాగుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు రోజులుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయని తెలిపారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పదేళ్లలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో సంక్షేమ పథకాల ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు సంక్షేమం, విద్య, వైద్యం వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఆదివారం జరిగే మహా ధర్నాకు కాంగ్రెస్ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చేలా డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు సమన్వయం చేయాలని మంత్రులు ఆదేశించారు.
NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్‌తో పాటు ఇతర కాంగ్రెస్ అనుబంధ ఫ్రంటల్ ఆర్గనైజేషన్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రులు సూచించారు. మహా ధర్నా బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద సమావేశమై ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశించారు. అలాగే నియోజకవర్గ ఇంచార్జిలు, NSUI, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఇతర ఫ్రంటల్ ఆర్గనైజేషన్లతో సమన్వయం చేసుకుంటూ మీడియా సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మంత్రి అజారుద్దీన్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ తదితర డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జిలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!