

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఇచ్చిన ఆదేశాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆదేశాలు తెలంగాణకు గొడ్డలిపెట్టులాంటివని, కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ఎక్స్ వేదికగా విమర్శించారు. ఎల్‌నినో పేరుతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించిన ఆయన, వెలిగొండ ప్రాజెక్టుకు ఏ నిబంధనలు, ఏ హక్కుల ప్రకారం నీటిని తరలిస్తున్నారో ప్రశ్నించారు. ఏపీ నీటి వినియోగం కేఆర్ఎంబీకి కనిపించడం లేదా అని నిలదీశారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీకి అప్పగించినట్టుగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులు మూసివేయడంతో రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఆగస్టు 21న శ్రీశైలంలో 169 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం 139 టీఎంసీలకు తగ్గిందని, 15 రోజుల్లో 30 టీఎంసీలు తగ్గాయని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తే బోర్ల కింద సాగు చేస్తున్న రైతులకు కూడా కరెంట్ సమస్యలు ఎదురవుతాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టి, ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని కేటీఆర్ అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!