

యంగ్ అండ్ టాలెంటెడ్ నటి అనిష్మా అనిల్ కుమార్ కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘యూత్’, ‘సిరాయ్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ప్రస్తుతం దర్శకుడు అమీర్ కాంబినేషన్‌లో ‘మకాలి’ అనే సినిమాలో నటిస్తోంది. తండ్రీకూతుళ్ల మధ్య బలమైన అనుబంధం, భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల సినిమా పూజా కార్యక్రమాలు పూర్తికాగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిష్మా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ తమిళ భాషపై తనకున్న ప్రేమ గురించి వెల్లడించారు. చిన్నప్పుడు తన తల్లి వేరే జిల్లాలో ఉద్యోగం చేయడంతో ఇంట్లో తండ్రీకూతుళ్లు మాత్రమే ఉండేవాళ్లమని, అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో తండ్రితో కలిసి సినిమాలు చూసేదాన్నని తెలిపారు.
విజయ్ నటించిన ‘గిల్లి’, ‘అళగియ తమిళ్ మగన్’ వంటి సినిమాలు చూడటం, తమిళ పాటలు వినడం ద్వారా ఆ భాషపై ఆసక్తి పెరిగిందని అనిష్మా చెప్పారు. సినిమాలు చూస్తూనే తాను ఒకటో తరగతిలోనే తమిళం చదవడం, రాయడం నేర్చుకున్నానని తెలిపారు. ‘అళగియ తమిళ్ మగన్’లో గురు అనే పాత్ర తన స్వస్థలం గురువాయూర్ అని చెప్పే సన్నివేశం తనను ఎంతగానో ఆకట్టుకుందని, దాంతో తాను కూడా తన స్వస్థలం ‘కట్టకడై’ అని తమిళంలో రాయడం ప్రాక్టీస్ చేశానని గుర్తుచేశారు. సినిమా తన జీవితాన్నే మార్చేసిందని, తమిళ భాషపై అమితమైన ప్రేమను పెంచిందని, ఇప్పుడు ఆ భాష తన జీవితంలో ఒక భాగమైపోయిందని ఆనందం వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!