

చైనా ప్రభుత్వం పలువురు ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టింది. 2017 డోక్లాం ప్రతిష్ఠంభన, 2020 గల్వాన్ ఘర్షణల సమయంలో వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు నాయకత్వం వహించిన మాజీ జనరల్ ఝావో జోంగ్‌కీని కీలక పదవుల నుంచి తొలగించింది. చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలితో పాటు మరో రెండు పదవుల నుంచి ఆయనను తప్పించినట్లు బీజింగ్ ప్రకటించింది. అయితే ఈ చర్యకు గల కారణాలను అధికారికంగా వెల్లడించలేదు.
భారత్‌తో సరిహద్దు వ్యవహారాలను పర్యవేక్షించే వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు ఝావో 2016లో తొలి కమాండర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2017లో డోక్లాంలో భారత్-చైనా సైన్యాల మధ్య సుదీర్ఘ ప్రతిష్ఠంభన, 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల సమయంలో ఆయన కీలక బాధ్యతల్లో ఉన్నారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చేపడుతున్న సైనిక ప్రక్షాళన, అవినీతి నిరోధక చర్యల్లో భాగంగానే తాజా తొలగింపులు జరిగి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!