

విమానాశ్రయాల నిర్వహణ రంగంలోని జీఎంఆర్ గ్రూప్ అంతర్జాతీయంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పశ్చిమాసియా, మధ్య ఆసియా, తూర్పు ఐరోపా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో విమానాశ్రయాల నిర్వహణతో పాటు అనుబంధ వ్యాపారాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తామని సంస్థ ఛైర్మన్ జీఎం రావు 2025-26 వార్షిక నివేదికలో తెలిపారు. విమాన ప్రయాణాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఈ వృద్ధి మరింతగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం జీఎంఆర్ ఇండోనేషియాలో ఒక విమానాశ్రయాన్ని నిర్వహిస్తుండగా, గ్రీస్‌లో మరో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది.
తక్కువ మూలధనంతో నిర్వహించగల ‘అసెట్ లైట్’, ‘క్యాపిటల్ లైట్’ వ్యాపారాలపై సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. డ్యూటీ ఫ్రీ, కార్గో, రిటెయిల్, ఆహార-పానీయాలు, నిర్వహణ-పర్యవేక్షణ సేవలను విస్తరించనున్నట్లు తెలిపింది. 2025-26లో జీఎంఆర్ నిర్వహణలోని భారతీయ విమానాశ్రయాలు 11.46 కోట్ల మంది ప్రయాణికులకు సేవలందించాయి. దేశీయ విమాన ప్రయాణాల్లో 25.6 శాతం, అంతర్జాతీయ ప్రయాణాల్లో 33.9 శాతం వాటా జీఎంఆర్ విమానాశ్రయాలదే. హైదరాబాద్, దిల్లీ సహా దేశంలో ఆరు విమానాశ్రయాలను నిర్వహిస్తున్న సంస్థ.. 2025-26లో ఏకీకృత ప్రాతిపదికన రూ.472 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కేంద్రం ప్రైవేటీకరించనున్న 11 ప్రాంతీయ విమానాశ్రయాల వేలంలోనూ పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!