

ముంబైలో జూన్‌లో జరిగిన మొహర్రం ఊరేగింపులో ప్రజలకు విషపదార్థం కలిపిన క్యాప్సుల్స్ పంపిణీ చేశారన్న ఆరోపణలపై పుణెకు చెందిన 39 ఏళ్ల ఫయాజ్ ప్రేమ్‌జీపై ముంబై పోలీసులు 700 పేజీల చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఫయాజ్ 50 కిలోలకు పైగా జింక్ ఫాస్ఫైడ్‌ను సేకరించి వేలాది క్యాప్సుల్స్ సిద్ధం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని నొప్పి నివారణ మందులు, రోగనిరోధక శక్తిని పెంచే మాత్రలుగా చెబుతూ ఊరేగింపులో పంపిణీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 14,900 క్యాప్సుల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఊరేగింపులో ఓ వ్యక్తి క్యాప్సుల్ తీసుకున్న తర్వాత వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం క్యాప్సుల్స్ పంపిణీ చేస్తున్న ఫయాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. చార్జ్‌షీట్‌లో 30 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు సమాచారం. తన వర్గానికి చెందిన కొందరితో ఉన్న పాత విభేదాల నేపథ్యంలో ఫయాజ్ ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న క్యాప్సుల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా, తుది నివేదిక రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!