

అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. తుపాను ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు చర్యల నుంచి, తుపాను తీరం దాటిన తర్వాత సహాయక కార్యక్రమాల పర్యవేక్షణ వరకు నాలుగు రోజులుగా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. మంగళవారం నుంచి అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు సమీక్షలు కొనసాగించిన ఆయన, ఉదయం 6.15 గంటల నుంచే మళ్లీ టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. మూడు రోజుల్లో మంత్రులు, అధికారులతో కలిపి పది సార్లు సమీక్షలు, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేశారు.
బుధవారం ఉదయం వర్షంలోనే సచివాలయానికి చేరుకున్న చంద్రబాబు రాత్రి వరకు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. గురువారం కేబినెట్ సమావేశాన్ని వర్చువల్‌గా నిర్వహించి, ప్రధానంగా తుపాను బాధితులకు అందుతున్న సహాయంపై చర్చించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి, కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు. క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తర్వాత మరో రెండున్నర గంటలపాటు అధికారులతో సమీక్షించారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. చివరి బాధితుడికి సాయం అందేవరకు సహాయక చర్యలు కొనసాగించాలని, ఆదివారం నాటికి అన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!