

వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దేశంలో భారీ స్థాయిలో మాల్వేర్ దాడులు జరుగుతున్నాయని భారత జాతీయ సైబర్ భద్రతా సంస్థ సెర్ట్-ఇన్ (CERT-In) హెచ్చరించింది. ఈ మాల్వేర్ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లోకి ప్రవేశించినట్లయితే, సైబర్ నేరగాళ్లు వినియోగదారుల అనుమతి లేకుండానే పరికరాలపై నియంత్రణ సాధించే అవకాశం ఉందని తెలిపింది. కాస్పెర్స్కీ, సెక్యూర్‌లిస్ట్ వంటి ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థల పరిశోధనల ఆధారంగా ఈ హెచ్చరిక జారీ చేసినట్లు పేర్కొంది.
సెర్ట్-ఇన్ ప్రకారం, హ్యాకర్లు ముందుగా కొన్ని వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేసి, ఆ ఖాతాల్లోని కాంటాక్టులకు ప్రమాదకరమైన ఫైళ్లను పంపుతున్నారు. పరిచయస్తుల నుంచి వచ్చిన ఫైల్ అని భావించి వాటిని ఓపెన్ చేసే వినియోగదారులు మోసపోతున్నారు. ముఖ్యంగా విజువల్ బేసిక్ స్క్రిప్ట్ ఫైళ్ల ద్వారా మాల్వేర్ వ్యాపిస్తోందని అధికారులు హెచ్చరించారు. ఇటువంటి ఫైళ్లు ఓపెన్ చేస్తే బ్యాంకింగ్ వివరాలు, పాస్వర్డ్లు దొంగిలించబడే ప్రమాదం ఉందని, తెలియని ఫైళ్లను తెరవకూడదని, సందేహాస్పద ఫైల్ వచ్చినప్పుడు పంపిన వ్యక్తిని ఫోన్ ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!