

దేశంలో వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడంతో పాటు మార్కెట్లో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక చర్యలు చేపట్టింది. లీగల్ మెట్రాలజీ నిబంధనల కింద వంట నూనెల ప్యాక్ సైజులను క్రమబద్ధీకరించి, ఒకే విధమైన ప్రామాణిక పరిమాణాలను అమలు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో మే 20, 2026న వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో దేశంలోని ప్రధాన వంట నూనెల పరిశ్రమల సంఘాలు పాల్గొన్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో 650 గ్రాములు, 700 గ్రాములు, 810 గ్రాములు, 850 గ్రాములు, 870 గ్రాములు వంటి అసాధారణ పరిమాణాల్లో వంట నూనెలు విక్రయించబడుతున్నాయని పరిశ్రమల ప్రతినిధులు తెలిపారు. దీనివల్ల వినియోగదారులు ధరలను పోల్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి 200 మి.లీ, 500 మి.లీ, 1 లీటర్, 2, 3, 4, 5 లీటర్లు, అలాగే 15 మరియు 20 లీటర్లు లేదా కేజీల ప్రామాణిక ప్యాక్ సైజులను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. పామ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆవాల నూనె, వేరుశెనగ నూనె తదితర వంట నూనెలకు ఈ నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. 200 మి.లీ కంటే తక్కువ ప్యాకెట్లకు మినహాయింపు ఇవ్వాలని పరిశ్రమలు కోరగా, అమలుకు మూడు నెలల గడువు ఇవ్వాలని సూచించాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!