

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు సినిమాలు, వేడుకలకే పరిమితం కాకుండా సామాజిక సేవలోనూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హెచ్‌పీవీపై అవగాహన కల్పించే భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో 820 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, దాదాపు మూడు లక్షల మంది బాలికలకు హెచ్‌పీవీపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.
పాఠశాలలు, స్థానిక సముదాయాలను కేంద్రంగా చేసుకుని నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో హెచ్‌పీవీ అంటే ఏమిటి, దాని వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టీకాల ప్రాముఖ్యత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాల్లో అర్హత కలిగిన వైద్య నిపుణుల సలహా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా వివరించారు. సాధారణంగా అభిమాన సంఘాలు సినిమా వేడుకలతో వార్తల్లో నిలుస్తుండగా, యువత ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టడం ప్రత్యేకంగా నిలిచింది. అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమానాన్ని సామాజిక బాధ్యతగా మార్చిన తీరుపై వైద్య రంగ ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!