

అమెరికాకు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తన వాణిజ్య విమానాల విభాగంలో సుమారు 5 శాతం ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించింది. బీ737 మ్యాక్స్ విమానాల ఉత్పత్తిని పెంచడంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం, ఇతర ఉత్పత్తి సవాళ్లు ఈ నిర్ణయానికి కారణమని వాణిజ్య విమానాల విభాగాధిపతి స్టెఫానీ పోప్ తెలిపారు. విమానాల తయారీ షెడ్యూళ్లను సవరించడం, ఉత్పత్తి ప్రణాళికల్లో మార్పుల వల్ల అవసరానికి మించి సిబ్బంది ఉన్నారని ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో పేర్కొన్నారు. ఈ తగ్గింపులో కొందరు పదవీ విరమణ ద్వారా బయటకు వెళ్లనుండగా, మరికొందరికి లేఆఫ్‌లు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు డిసెంబరులో జారీ చేయనున్నట్లు తెలిపారు. విమానాల రెక్కల తయారీలో జాప్యం కారణంగా ఉత్పత్తి నెమ్మదించిందని బోయింగ్ సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్ గత నెలలో పెట్టుబడిదారులకు వివరించారు. ప్రస్తుతం నెలకు 47 విమానాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ, 2027 ద్వితీయార్ధంలో ఆ సంఖ్యను 52కు పెంచాలని యోచిస్తోంది.
మరోవైపు, ఆస్ట్రేలియా జాతీయ విమానయాన సంస్థ క్వాంటాస్ ఎయిర్‌వేస్ 850 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ సీఈఓ వెనిస్సా హడ్సన్ వెల్లడించారు. తొలివిడతలో ఫైనాన్స్, ప్రొక్యూర్‌మెంట్, మానవ వనరులు, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగాల కోత ఉండనుంది. మరికొన్ని బాధ్యతలను కన్సల్టింగ్ సంస్థ యాక్సెంచర్‌కు అప్పగించాలని క్వాంటాస్ యోచిస్తోంది. ఈ క్రమంలో కొన్ని ఉద్యోగాలను యాక్సెంచర్‌కు బదిలీ చేయనుండగా, వాటిలో భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల బృందాలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగాల కోతలో తొలి విడత చర్యలు 2027 మధ్యలో ప్రారంభమవుతాయని హడ్సన్ తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!