

అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌లను అరికట్టేందుకు భారత్, అమెరికా కలిసి వ్యూహాత్మక చర్యలకు సిద్ధమవుతున్నాయి. ఈ దిశగా నవంబర్ 2, 3 తేదీల్లో న్యూఢిల్లీలో ఇరు దేశాల డ్రగ్ పాలసీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ గ్రూప్ రెండో సమావేశం జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ఆతిథ్యమిచ్చిన ఈ భేటీలో సరిహద్దులు దాటి విస్తరిస్తున్న డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌లు, సింథటిక్ డ్రగ్స్ అక్రమ రవాణా, వాటికి అవసరమైన రసాయనాల సరఫరా వంటి అంశాలపై చర్చించారు. డ్రగ్స్ తయారీదారులు, సరఫరాదారులతో పాటు వాటి వెనుక ఉన్న ఆర్థిక సహాయకులపై కూడా నిఘా పెంచాలని ఇరు దేశాలు దృష్టి సారించాయి.
సింథటిక్ డ్రగ్స్ తయారీలో ఉపయోగించే ప్రీకర్సర్ రసాయనాల అక్రమ సరఫరాను అడ్డుకోవడం, చట్టబద్ధమైన రసాయనాలు, ఔషధాల సరఫరా వ్యవస్థను నేరగాళ్లు దుర్వినియోగం చేయకుండా పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ చర్చల్లో ప్రధాన అంశాలుగా నిలిచాయి. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడే అంతర్జాతీయ ముఠాల ఆర్థిక మూలాలను గుర్తించడం, వాటి నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయడంలో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!