

ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించేందుకు ‘భారత్ సమిట్ 2.0’ అంతర్జాతీయ వేదికగా నిలవనుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. హైదరాబాద్ వేదికగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు, సన్నద్ధతపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక తరహాలో భారత్ సమిట్ ప్రపంచ విధాన చర్చలకు వేదికగా నిలుస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, అహింస, అలీన విధానం, మిశ్రమ ఆర్థిక విధానాలు ప్రపంచానికి మార్గదర్శకాలుగా నిలవగలవని అభిప్రాయపడ్డారు.
రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరిపేందుకు ఈ సమిట్ ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భారత్ సమిట్‌కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానిస్తే తప్పేంటని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఈ అంశంపై భాజపా నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ సదస్సుకు సుమారు 70 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు నేతలు వెల్లడించారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో భారత్ సమిట్ 2.0 నిర్వహించనున్నారు. ప్రపంచ సమస్యలు, విధానపరమైన అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చించేందుకు ఈ కార్యక్రమం కీలక వేదికగా నిలవనుందని వారు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!