

రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి చెందిన 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్‌కు పంపించనున్నారు. ఆగస్టు 17 నుంచి 26 వరకు ఎనిమిది రోజుల పాటు ఫిన్లాండ్‌లోని టుర్కు విశ్వవిద్యాలయంలో వీరికి అంతర్జాతీయ వృత్తిపర అభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు.
ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారు. ఫిన్లాండ్‌లోని విద్యా విధానాలు, ఆధునిక బోధనా పద్ధతులను ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం ఎంపికైన ఉపాధ్యాయులకు లభించనుంది. అక్కడ పొందిన అనుభవం, పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులతో పంచుకునేలా కార్యక్రమాన్ని రూపొందించారు.
టుర్కు విశ్వవిద్యాలయంతో కలిసి రూపొందించిన ఈ కార్యక్రమంలో ప్రారంభ బాల్య విద్య, ప్రాథమిక విద్యకు సంబంధించిన ఆధునిక బోధనా విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. బాలకేంద్రిత అభ్యసనం, ఆనందదాయక బోధన, ఆట ఆధారిత విద్య వంటి విధానాలను ఉపాధ్యాయులకు పరిచయం చేయనున్నారు. మూడు దశల్లో అమలు చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ శిక్షణ ద్వారా రాష్ట్రంలో బోధన, అభ్యసన నాణ్యతను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!