

అణు పరీక్షలను గుర్తించే సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అమెరికా కొత్త ప్రయోగాన్ని నిర్వహించింది. నెవాడా నేషనల్ సెక్యూరిటీ సైట్‌లోని భూగర్భంలో జరిగిన ఈ ప్రయోగంలో అణుయేతర రసాయనిక అధిక శక్తి పేలుడు పదార్థాలను ఉపయోగించారు. ఇది అణు పరీక్ష కాదని అమెరికా జాతీయ అణు భద్రతా సంస్థ (NNSA) స్పష్టం చేసింది. తక్కువ స్థాయి భూగర్భ అణు విస్ఫోటనాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచడం, వాటి సంకేతాలను మరింత కచ్చితంగా విశ్లేషించడమే ప్రయోగం లక్ష్యమని తెలిపింది.
నెవాడా నేషనల్ సెక్యూరిటీ సైట్‌లోని ఏరియా-12లో ఉన్న ‘పీ టన్నెల్’లో ఈ ప్రయోగం జరిగింది. రసాయనిక అధిక శక్తి పేలుడు పదార్థాలతో పాటు రేడియోట్రేసర్లను ఉపయోగించి వివిధ సెన్సర్ల ద్వారా సమాచారాన్ని సేకరించారు. ఈ డేటాను శాస్త్రీయ నమూనాలను ధ్రువీకరించేందుకు, అణు పేలుళ్లను గుర్తించే కంప్యూటర్ అల్గారిథమ్‌లను మెరుగుపర్చేందుకు ఉపయోగించనున్నారు. ముఖ్యంగా భూగర్భ గుహలు, టన్నెల్స్‌లో పేలుడు నిర్వహించి దాని భూకంప సంకేతాలను తగ్గించే ‘డీకప్లింగ్’ విధానాన్ని గుర్తించడంపై ప్రయోగం దృష్టి పెట్టింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!