

మొదటి దశ మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన రుణాల కోసం ఎస్‌బీఐ క్యాపిటల్ సర్వీసెస్ (ఎస్‌బీఐ క్యాప్స్) బ్యాంకులతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 3 శాతం వడ్డీ రేటుతోపాటు మూడు నెలల్లో రుణ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. రెండో దశలోని ఏడు కారిడార్లకు కేంద్ర అనుమతులు పొందేందుకు మొదటి దశను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో, ఎల్‌అండ్‌టీ నుంచి మూడు కారిడార్లను రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో రూ.13,600 కోట్లను బ్యాంకుల ద్వారా రుణంగా సమీకరించనుండగా, మిగతా రూ.1,400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చెల్లించనుంది.
ఎల్‌అండ్‌టీ 2012లో పీపీపీ విధానంలో చేపట్టిన మొదటి దశలోని 72 కిలోమీటర్లలో 69 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు వ్యయం పెరగడంతో సంస్థ వివిధ బ్యాంకుల నుంచి 7–8 శాతం వడ్డీతో రుణాలు తీసుకుంది. కరోనా ప్రభావంతో కార్యకలాపాలు దెబ్బతినడంతో అప్పులు, వడ్డీల భారం పెరిగింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా 3 శాతం వడ్డీతో రుణాలు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌బీఐ క్యాప్స్‌ను ఆదేశించింది. దీంతో సంస్థ జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులతో పాటు గిఫ్ట్‌సిటీ, జైకా, ఏడీబీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రుణాలను 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ప్రతిపాదిస్తూ మెట్రో ఆస్తులు, కారిడార్ల వివరాలతో కూడిన పత్రాలను బ్యాంకులకు అందిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!