

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎంపిక కాని దరఖాస్తుదారులు చెల్లించిన రూ.10 వేల ధరావతు మొత్తాన్ని హౌసింగ్ బోర్డు శుక్రవారం నుంచి తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. దరఖాస్తు సమయంలో ఒక్కో అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్‌గా చెల్లించారు. రెవెన్యూ, రవాణా, జీహెచ్‌ఎంసీ తదితర శాఖల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా హౌసింగ్ బోర్డు సమగ్రంగా పరిశీలన చేపట్టింది. 16 నియోజకవర్గాల నుంచి మొత్తం 60,720 దరఖాస్తులు రాగా.. తొలి దశ పరిశీలనలో సుమారు 40 వేల మందిని అనర్హులుగా గుర్తించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. వీరందరికీ వారు చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నారు.
ఎంపికైన లబ్ధిదారుల్లో పలువురు తమ దరఖాస్తుల్లో ఫోన్ నంబర్లను తప్పుగా నమోదు చేసినట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు గుర్తించారు. ఫోన్ నంబర్ మార్చుకునే అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తుల మేరకు హౌసింగ్ బోర్డు వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎంపికైన వారు దరఖాస్తు లేదా ఆధార్ నంబర్‌తో తమ అప్లికేషన్‌లోకి వెళ్లి అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. మరోవైపు ఎంపికైన కుటుంబాలపై క్షేత్రస్థాయి సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 5,500 కుటుంబాలను పరిశీలించినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తయ్యే అవకాశం ఉండగా.. తుది నిర్ణయం అనంతరం జాబితాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. 16 నియోజకవర్గాల్లో ఆగస్టు 31న లాటరీ ప్రక్రియ పూర్తికాగా, ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపిక జాబితాను బుధవారం రాత్రి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చారు. లాటరీ సందర్భంగా స్థానికతపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అధికారులు అదనపు పరిశీలన చేపట్టి, స్థానికతను నిర్ధారించిన అనంతరం జాబితాను అప్‌లోడ్ చేసినట్లు తెలిసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!