

ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణ, ఇతర అసంఘటిత రంగ కార్మికుల జీవితాలను మెరుగుపరచేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన సమీకృత ‘లేబర్ అడ్డా’ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విజయవాడలో ఒక కేంద్రాన్ని ప్రారంభించగా, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి నగరాల్లో కూడా వీటిని అందుబాటులోకి తేనున్నారు. ఈ కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విశ్రాంతి గదులు, టీవీలు, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాల దరఖాస్తు సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
లేబర్ అడ్డాలు కార్మికులకు వన్‌స్టాప్ సేవా కేంద్రాలుగా పనిచేయనున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసే హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ఈ-శ్రమ్ పోర్టల్ నమోదు, ఆధార్ అనుసంధానం, బ్యాంకు ఖాతాల ప్రారంభం, బీమా, పింఛను, సామాజిక భద్రతా పథకాల సదుపాయాలు అందిస్తారు. కాంట్రాక్టర్లు ముందుగానే కార్మికులను సంప్రదించి పనులకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. పని లేని రోజుల్లో కార్మికులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఆధునిక నిర్మాణ పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. కార్మికుల పిల్లలకు విద్యా మార్గదర్శనం, ఉపాధి అవకాశాలు, శిక్షణలు, వ్యాపార రుణ సదుపాయాలు కూడా కల్పించనున్నారు. సీఎస్ఆర్ ఆధారిత వైద్య శిబిరాలు, అన్నక్యాంటీన్ కూపన్లు వంటి సేవలతో కార్మిక సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!