

యుద్ధంలో భారీ సంఖ్యలో సైనికులు మరణించే పరిస్థితులు ఎదురైతే ఎలా వ్యవహరించాలనే అంశంపై అమెరికా సైన్యం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సామూహిక తాత్కాలిక సమాధుల (Mass Graves) ఏర్పాటు, మృతదేహాల గుర్తింపు, వాటిని భద్రపరచడం, యుద్ధం ముగిసిన తర్వాత స్వదేశానికి తరలించడం వంటి అంశాలపై సైనికులకు శిక్షణ ఇస్తోంది. నార్త్ కరోలినాలో నిర్వహించిన ‘ఆపరేషన్ డ్రాగన్ కోవెనెంట్’ రెండో దశలో బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలతో తాత్కాలిక ఖనన స్థలాలను తవ్వి పూడ్చే ప్రక్రియను పరీక్షించారు. కొరియా యుద్ధం (1950–53) తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఇటువంటి ప్రక్రియలను పరీక్షించడం ఇదే తొలిసారని అమెరికా సైన్యం వెల్లడించింది. ఆ యుద్ధంలో 36,515 మంది అమెరికా సైనికులు మరణించగా, మరో 7,245 మంది పట్టుబడ్డారు.
అమెరికా సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక తాత్కాలిక ఖనన స్థలంలో ఐదు సమాంతర గోతులు ఏర్పాటు చేసి సుమారు 100 మృతదేహాలను భద్రపరిచేలా ప్రణాళిక రూపొందించారు. తాజా శిక్షణలో ఉపయోగించిన భారీ యంత్రాలతో నిరంతరంగా పనిచేస్తే 24 గంటల్లో 2,400 మృతదేహాలకు సరిపడా ఖనన ఏర్పాట్లు చేయవచ్చని అంచనా వేశారు. మరోవైపు ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణ, పశ్చిమాసియాలో అమెరికా సైనికుల మరణాల నేపథ్యంలో ఈ శిక్షణపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. అక్టోబర్ 29 నాటికి ఇరాన్ యుద్ధ కార్యకలాపాల నేపథ్యంలో మరణించిన అమెరికా సైనికుల అధికారిక సంఖ్య 23కు చేరినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ శిక్షణను ఇరాన్‌పై దాడులకు సంబంధించిన ముందస్తు ఏర్పాటుగా అమెరికా సైన్యం ప్రకటించలేదు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!