

‘ఇన్వెస్ట్ తెలంగాణ’ పేరుతో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు ప్రజాభవన్‌లో ప్రత్యేక వార్‌రూమ్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. రోజువారీగా ఏర్పాట్ల పురోగతిని పర్యవేక్షిస్తూ వివిధ శాఖల మధ్య సమన్వయం చేయాలని సూచించారు. సమిట్ నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి సీనియర్ అధికారులను బాధ్యులుగా నియమించాలని చెప్పారు. సమిట్-2026కు లోగో రూపొందించడం, అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణను ఖరారు చేయాలని సూచించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు కార్యక్రమాలు రూపొందించాలని, అక్టోబర్ తొలి లేదా రెండో వారంలో ఢిల్లీలో ప్రచార కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు.
ఇదే సమయంలో తెలంగాణను హరిత ఇంధన రంగంలో గ్లోబల్ గ్రీన్ హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 25వ వార్షికోత్సవంలో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఆర్థిక, పారిశ్రామిక, సుస్థిర గ్రీన్ టెక్నాలజీ రంగాల్లో ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. సూర్యరశ్మి, నీరు, విద్యుత్‌ను సమర్థంగా వినియోగించేలా భవనాల నిర్మాణం చేపడితే పర్యావరణం, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, సామూహిక గృహ నిర్మాణాల్లో గ్రీన్ విధానాలను అమలు చేసేందుకు ఐజీబీసీతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!