

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ, ఐవీఎఫ్ సేవలు మరింత మెరుగుపడుతున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఏఆర్‌టీ, సరోగసీ చట్టాల అమలులో నిర్లక్ష్యం వహించే ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో, గాంధీ, పేట్లబుర్జు ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 39,802 మందికి ఫెర్టిలిటీ వైద్య సేవలు అందించినట్లు అధికారులు వెల్లడించారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న అనేక మంది దంపతులకు ఈ ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాలు ఉపయోగపడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
జిల్లాల్లో కూడా దశలవారీగా ఐవీఎఫ్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 379 ప్రైవేట్ ఫెర్టిలిటీ సెంటర్లను తనిఖీ చేయగా, 50 కేంద్రాల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి చర్యలు తీసుకున్నట్లు కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ వివరించారు. మరోవైపు, తమ స్టైపెండ్ పెంపుపై మంత్రి హామీ ఇవ్వడంతో ఆయుష్ విద్యార్థులు సమ్మె విరమించినట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది. సచివాలయంలో మంత్రిని కలిసిన విద్యార్థులు తమ సమస్యలను వివరించగా, పరిష్కారానికి హామీ లభించడంతో సమ్మెను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!