

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రైతు సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వం వెయ్యి రోజుల మైలురాయిని చేరుకున్న సందర్భంగా సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, సన్నవడ్లకు బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, రూ.500కే ఎల్పీజీ సిలిండర్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. అలాగే 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేయడంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వెయ్యి రోజుల పాలనలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం లేదని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి దేశంలోనే అత్యుత్తమ సంక్షేమ పాలన అందిస్తున్నారని ప్రభుత్వ విప్‌లు వేముల వీరేశం, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాగూర్, మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు విస్తృత ప్రయోజనం చేకూర్చుతున్నాయని వారు అన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!