

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య రాజకీయ విలువలకు మానవ రూపం, నిజాయతీకి నిలువెత్తు ప్రతిరూపమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. సోమవారం విశాఖపట్నంలోని సిరిపురం సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన, రోశయ్యను ఒక రాజకీయ పాఠశాలగా అభివర్ణించారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ మధ్య వాడీవేడిగా చర్చలు జరిగిన సందర్భాల్లో రోశయ్య జోక్యం చేసుకుని పరిస్థితిని చల్లబరుస్తూ సమతుల్యంగా వ్యవహరించేవారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. నేటి యువత రోశయ్య జీవిత చరిత్ర, రాజకీయ విలువలు, సమాజ సేవ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
రోశయ్య చరిత్ర, రాజకీయ విలువలు, సమాజ సేవపై పాఠ్యాంశాల్లో ఒక అధ్యాయం చేర్చేందుకు కృషి చేస్తానని లోకేశ్ తెలిపారు. అలాగే టీడీపీ క్యాడర్ శిక్షణలో ప్రత్యేక అధ్యాయం ఏర్పాటు చేయాలని, ఆయన జీవితంపై పుస్తకాలు, వీడియోలు రూపొందించి యువతకు చేరువ చేయాలని సూచించారు. రోశయ్య జీవిత విశేషాలను ప్రతిబింబించే మ్యూజియం కోసం స్థలం గుర్తిస్తే 18 నెలల్లో పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా దేశానికి అంకితం చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమరావతిలోని పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’గా పిలుస్తున్నట్లే, విశాఖలోని రోశయ్య విగ్రహాన్ని ‘ది స్టాచ్యూ ఆఫ్ స్టేట్స్‌మన్’గా పిలుద్దామని ప్రతిపాదించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!